Powered by OpenAIRE graph
Found an issue? Give us feedback
image/svg+xml art designer at PLoS, modified by Wikipedia users Nina, Beao, JakobVoss, and AnonMoos Open Access logo, converted into svg, designed by PLoS. This version with transparent background. http://commons.wikimedia.org/wiki/File:Open_Access_logo_PLoS_white.svg art designer at PLoS, modified by Wikipedia users Nina, Beao, JakobVoss, and AnonMoos http://www.plos.org/ ZENODOarrow_drop_down
image/svg+xml art designer at PLoS, modified by Wikipedia users Nina, Beao, JakobVoss, and AnonMoos Open Access logo, converted into svg, designed by PLoS. This version with transparent background. http://commons.wikimedia.org/wiki/File:Open_Access_logo_PLoS_white.svg art designer at PLoS, modified by Wikipedia users Nina, Beao, JakobVoss, and AnonMoos http://www.plos.org/
ZENODO
Article
Data sources: ZENODO
addClaim

చంద్రబోస్ పాట - ప్రేరణాత్మకత

Authors: కొప్పిశెట్టి, కుశరాజు;

చంద్రబోస్ పాట - ప్రేరణాత్మకత

Abstract

చంద్రబోస్ పాట - ప్రేరణాత్మకత కొప్పిశెట్టి కుశరాజు, పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్ ,విశాఖపట్నం. ISSN: 3108-1053 (VOLUME-1, ISSUE-2) Received: March 15, 2025 Revised: April 05, 2025 Accepted: May 10, 2025 Published: June 30, 2025 DOI: 10.5281/zenodo.20550860 1. వ్యాస సంగ్రహం : సామాజిక ప్రతిబింబమే సాహిత్యం.రచయితలు సామజిక అంశాలనే తమ సాహిత్య రచనలో వ్యక్తీకరిస్తారు. సినిమా పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మనలోని భావాలను, ఆలోచనలను మరియు సామాజిక అంశాలను ప్రతిబింబించే అద్దాలు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినీగేయ చరిత్రలో, ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రేణాత్మక గేయాలు రచించబడ్డాయి. అవన్నీ కూడా సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షించినవే మరియు శ్రోతలను, ప్రేక్షకులను వెన్ను తట్టి ముందుకు నడిపించినవే.అటువంటి గేయాలు రచించిన వారిలో చంద్రబోస్ గారు ముఖ్యులు. చంద్రబోస్ గారు ఇప్పటివరకు కూడా ఎన్నో సందేశాత్మక,ప్రేరణాత్మక గేయాలను రచించి సినీగేయ ప్రపంచానికి అందించారు .ఇటువంటి గేయాలను రాయడంలో ఆయనది అందవేసిన చేయి. ఆయన ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమాలో రచించినటువంటి “ఎవరేమీ అనుకున్నా” అనే ప్రేరణాత్మక గేయాన్ని నా ఈ పరిశోధన పత్రంలో విశ్లేషించదలిచాను. చంద్రబోస్ సినీగేయాలపై మునికృష్ణా రెడ్డి గారు ‘శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం’లో “చంద్రబోస్ సినీ సాహిత్యం - పరిశీలన” అనే అంశంపై ఎం.ఫిల్ పూర్తి చేశారు. సినీగీతాలు, వాటిపై వచ్చిన విమర్శవ్యాసాలు, అంతర్జాలవనరులు ఈ వ్యాసరచనకు ప్రధాన ఆకారాలు. నిర్మాణాత్మకమైన పరిశోధనపద్ధతి ద్వారా ఈ పరిశోధనపత్రం రూపుదిద్దుకుంది. కీలక పదాలు : ఉపోద్ఘాతం, సినిమా, పాట, ప్రేరణాత్మకత, సమాజం, కృషి, శ్రమ,సందేశం ఆత్మవిశ్వాసం,లక్ష్యం, ముగింపు. 2. ఉపోద్ఘాతం : సినిమా అనేది సమాజంపై మీద అధిక ప్రభావాన్ని చూపుతుంది.సినిమాలో కథ కంటే కూడా పాటే ప్రజల మనసుపై,నాలుకపై ఎక్కువగా నర్తిస్తుంది. పాటకు సమాజాన్ని కదిలించే శక్తి కలదు.ఇంట బయట, వేడుకలలో, ప్రయాణములో , పనిలో, ఆటలో ఇలా పాట లేని చోటు లేదు. పాట ఆకాశం వలే విశ్వవ్యాప్తమైనది.సినిమా పాటలు మన సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. ఒక సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషిస్తాయి.తెలుగు చలనచిత్ర గేయసాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ప్రారంభంలో పౌరాణిక నాటకాల ప్రభావంతో పద్యాలు, గ్రాంధిక భాష ఎక్కువగా ఉండేది. కాలక్రమేణా అది వాడుక భాషలోకి మారి, సామాన్యులకు సైతం చేరువయ్యింది. ప్రజల భాషను దృష్టిలో పెట్టుకొని ప్రజల బాణిలో పాటలు రాయడం ప్రారంభమైంది. ప్రకృతి వర్ణనలు, సామాజిక అంశాలు మరియు భావోద్వేగాలను పలికించడంలో మన సినీ కవులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు.సినిమాలో కథా గమనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లేదా ఒక పాత్ర తాలూకా గొప్పతనాన్ని మరియు ఒక పాత్రలోని అంతర్మధనాన్ని వ్యక్తపరచడానికి పాటలను ఒక ముఖ్య సాధనంగా ఉపయోగిస్తారు. సినిమాకు పాట ప్రాణం వంటిది.సినిమా తాలూకా అంతరార్ధాన్ని పాట వ్యక్తీకరిస్తుంది.సినిమా పాట జనసామాన్యానికి దగ్గరగా ఉండి, వారిని ఆకర్షిస్తున్నటువంటి సాహితీ ప్రక్రియలో మొదటి స్థానంలో ఉంటుంది. “వినోదంతో పాటు మానసిక వికాసానికి తోడ్పడే కళారూపం సినిమాగీతం. అనేక సమస్యలతో జీవనం సాగించే జనావళికి మానసిక ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం కలిగించే సాధనంగా సినిమాకళ గుర్తించబడింది”.1 అనుకున్న ఆశయాలు,లక్ష్యాలు వైపు అడుగులు వేయడానికి అవసరమైన ఒక అంతర్గత శక్తియే ప్రేరణాత్మకత. ఇది కేవలం మాటల ద్వారానో, ఒక సన్నివేశం రూపంలోనూ మాత్రమే కాకుండా పాటల రూపములో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది.సినిమా రచయితలు కేవలం ప్రేమ పాటలు,వలపు పాటలు ,యుగళగీతాలు,విషాద గీతాలు, లలిత గీతాలు, భక్తి గీతాలు మొదలైనవి మాత్రమే కాకుండా సినిమాలోని సన్నివేశానికి సందర్భానుగుణంగా కొన్ని సందేశాత్మక,ప్రేరణాత్మక గేయాలను కూడా రచించి శ్రోతలకు , ప్రేక్షకులకు దిశా నిర్దేశం చేస్తూ మంచి మార్గంలో నడిపిస్తున్నారు.సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన పదాలతో లోతైన భావాన్ని పలికిస్తూ ఎంతోమంది జీవితాల్లో తమ అక్షరాలతో బాటలు పరిచారు. నిరాశ నిస్పృహలకు లోనై అలసిన జీవితానికి మరియు అజ్ఞాన అంధాకారంలో అలమటించే ప్రాణులకు దారి చూపే ప్రేరణాత్మకత అనేది ఎంత ముఖ్యమో, అది ఏ విధంగా నిన్ను కార్యసాధకుడిగా మార్చి, విజయ సోపానాలు అధిరోహించేలా చేస్తుందో రచయితలు రాసిన గేయాలా ద్వారా మనం గమనించవచ్చు.సర్వం కోల్పోయాము అని దుఃఖించే హతాశులు(ఆశలు అడగంటినవారు ) కూడా ప్రేరణాత్మక గేయాల ప్రభావంతో అనంత విజయాలను అందుకున్న వైనాలు కూడా సమాజంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇటువంటి గేయాలను రచించి సినీగేయ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబోసు గారు ధన్యులు.వారి కలం నుండి జాలువారిన ప్రేరణాత్మక సాహిత్యాన్ని పరిశీలిద్దాం. 3.రచయిత - పరిచయం తెలుగు సినీ వినీలాకాశములో తన పాటల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నా చల్లగరిగా చంద్రుడు మన చంద్రబోస్.ఆయన సాహిత్యం నిత్య నూతనంగా సాహితీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంటుంది. అలతి అలతి పదాలతో పాటలు రాయడం చంద్రబోస్ ప్రత్యేకత.ఈ విధంగా ఆయన చిన్న చిన్న పదాలనే ఉపయోగించిన వాటిని వ్యాఖ్యానిస్తే విపులమైన అర్థాలు, భావాలు ఆ చరణాలలో మనకి సాక్షాత్కరిస్తాయి.ఆయన పాటల శైలి సరళంగా ఉండటంచేత పామరులు సైతం అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. ప్రజల భాషను తన కవిత్వంలో పొందుపరిచారు.చంద్రబోస్ పాటలు అంత ఆకర్షణీయంగా,అంత ఆదరణ పొందడానికి కారణం ఆయన పాత్రల యొక్క ప్రవేశం చేసి అంటే పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి పాత్ర తాలూకా భావ సంఘర్షణను అనుభవించి రాయడం వల్ల ఈ రకమైనటువంటి ఆదరణ ప్రశంసలు పొందడం జరిగింది.ఆయన పాటల ప్రస్థానం చల్లగరిగ గ్రంథాలయం నుండి ప్రారంభమై అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ వేదిక వరకు కొనసాగుతూ వచ్చింది…. నాటు నాటు పాటకు సాహిత్యాన్ని రాసి దానిని అత్యంత ఆకర్షణీయంగా మరియు చెవులకు లయబద్దంగా మలచడం ద్వారా చంద్రబోస్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. RRR (2022) చిత్రంలో నాటు నాటు పాటకు చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డును గెలుపొందారు. తెలుగు సినీ గీత రచయితలలో ఈ అవార్డు పొందిన ఏకైక కవి, ఒకే ఒక్కడు చంద్రబోస్‌ కావడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈయన పూర్తి పేరు కునుకుంట్లు సుభాష్‌ చంద్రబోస్‌,జయశంకర్‌ (ఉమ్మడి వరంగల్‌) జిల్లా చల్లగరిగ గ్రామంలో 10.05.1972లో తల్లి మదనమ్మ, తండ్రి నరసయ్యలకు జన్మించడం జరిగింది.ఈయన చదివింది ఇంజనీరింగ్ అయినా సాహిత్యం పై మక్కువతో బాలసాహిత్యం,పత్రికలు, వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి పద సంపదను వృద్ధి చేసుకొని సినీ రంగంలో పాటల రచయితగా స్థిరపడ్డారు. 1995 లో తాజ్ మహాల్ సినిమాలో "మంచు కొండల్లో చంద్రమా" అనే పాటతో చంద్రబోస్ గారు తన సినీగేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు, అప్పటినుండి నేటి వరకు సుమారుగా 850 పైగా చిత్రాల్లో పాటలు రచించి,"సినీగేయ విశారద" "సాహిత్య చిచ్చరపిడుగు" వంటి బిరుదులను పొందారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ అవార్డులను అందుకోవడం జరిగింది. 3.చంద్రబోస్ పాట - జీవితానికి వెలుగుల బాట : ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం మరియు స్వరకల్పనలో వచ్చిన ‘ బడ్జెట్ పద్మనాభం’( 2001)లో ‘ఎవరేమీ అనుకున్న’ పాటను చంద్రబోస్ గారు తన అక్షర సేద్యం ద్వారా మనకు అందించగా, ఎస్పీ బాలు గారు తన సుమధురమైన గానంతో ఆలపించారు.చంద్రబోస్ గారిపై ఇతర కవుల ప్రభావం ఉండవచ్చేమో కానీ ఇలాంటి పాటలు రాయడంలో మాత్రం ఆయనకు ఆయన ఆదర్శం. ఇలాంటి ప్రతిపాట ఆయన ఎదుర్కున్న కష్టాలు,కన్నీళ్లు అవమానాల నుండి ఉద్భవించినవే.ఈ పాటలోని సాహిత్యం….. ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోనా పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ప్రతి అక్షరం పాత్రతాలుక ఆలోచనను సంఘర్షణనే అనుభవిస్తుంది. బడ్జెట్ పద్మనాభం పాత్ర సొంత ఇంటిని పొందడానికి పరితపిస్తుంది.అప్పుడు పాత్ర తాలూకు భావోద్వేగాన్ని తన రచన దర్పణం నుండి వీక్షించి రాసి,పద్మనాభం పాత్ర ద్వారా ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చారు బోసు గారు. కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని ముందుకు సాగాలి అనే తత్వం ఈ పాటలో ప్రస్ఫుటమవుతుంది.సమస్యలు, కష్టాలు ,నష్టాలు ,బాధలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ పాటలో లిరిక్స్ వింటే మాత్రం వాటన్నింటిని చిరునవ్వుతో,రేపటి నా జీవితం నేను ఆశించినట్టు,అనుకున్నట్టు మారుతుందని భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగవచ్చు.ఈ పాట విన్న వాళ్ళకి చక్కటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చంద్రబోస్ కష్టాల నుండి,జీవిత సవాళ్లు నుండి వెలికి వచ్చినటువంటి పాట ఇది. నిరాశ నిస్పృహలకులోనై, జీవితంలో అన్ని కోల్పోయాము, ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా వారికి జీవితంపై కొండంత ఆశలు రేపి, వెన్ను తట్టి ముందుకు నడిపించిన సాహిత్యం ఈ పాట సొంతం. ఇది కేవలం పాట మాత్రమే కాదు. ఇది మన అందరికి దారి చూపించే దీపం.మన చేయి పట్టి ముందుకు నడిపించే ఒక అమృతహస్తం. అలసిన జీవితానికి ఈ పాట ఒక బాట. తనకు తానే మంత్రిలా సలహాలు, సూచనలు ఇచ్చుకోవాలి,రాజుల ఆజ్ఞాపించుకొని, బంటులా తన కోసం తను శ్రమించాలి అని,ఆలోచన మనదే, ఆచరణ మనదే అనే వ్యక్తి తాలూకా కర్తవ్య నిష్ఠను రచయిత తెలియజేశారు.నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దానిని ఉద్ధరించడానికి ఎవరూ రారు. జీవితంలో ఏం కోరుకుంటావో, ఏం కావాలనుకుంటావో, అందుకోసం ఎలా నీ జీవితాన్ని మలుచుకుంటావో, నిన్ను నువ్వు ఎలా సంసిద్ధత చేసుకుంటావో,విజయ తీరాలు ఎలా చేరుకుంటావో అంత నీలోనే ఉంది.జీవిత బడిలో జ్ఞాన సాధనమైన పలక బలపంతో ప్రతి ప్రశ్న నీవే,దానికి సమాధానం నీవే,కల నీదే,కల కోసం నిరంతరం చేసే శ్రమ నీదే,కావున ప్రతి నిమిషం పోరాడాలి,పోరాటమే జీవితం. నా జీవితం ఏంటి,జీవన గమనం ఏంటి,నేను ఎందుకు పుట్టాను, నా ఉనికి ఏంటి, ఎందుకోసం పోరాడాలి, ఏం సాధించడం కోసం పోరాడాలి అనే ప్రశ్న నీదే ,జవాబు నీదే అంటూ రచయిత తన కలం అనే గళంతో మనలో చైతన్యాన్ని రేకేత్తించారు. మనం మంచి చేసిన చెడు చేసిన ఏ పని చేసినా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు, చేతలతో, మాటలతో మనల్ని విమర్శించే వాళ్ళు ఈ సమాజంలో అడుగడుగున ఉంటారు.వారికోసం మనం ఎన్నడు ఆలోచించరాదు, ఆగిపోరాదు, ఎవరో అన్న మాటలకు కృంగిపోయి,కుప్పకూలిపోయి,అలా జీవచ్ఛవంలా పడి ఉండక నదీ ప్రవాహంలా ముందుకు సాగిపోతూ, ఈ జీవితం దేవుడు ఇచ్చిన వరంగా భావించి,నమ్మిన ఆశయాల కోసం,అనుకున్న లక్ష్యం సాధించడం కోసం ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగినప్పుడు మీ విజయమే పెద్ద డంకై మోగుతుంది. నీ గెలుపే అందరికీ సమాధానం చెబుతుంది కావున ఎవరో అన్న మాటలకి అక్కడే ఆగిపోతే నీ జీవితం అర్ధాంతరంగా ముగిస్తుంది.అలా జరగకుండా ఉండాలి అంటే నీ జీవితం అనే సామ్రాజ్యానికి నువ్వే రాజు,నువ్వే బంటు,నువ్వే మంత్రిగా ఉంటూ నీ జీవితాన్ని ఉన్నత పథంలో నడిపించుకోవాలంటూ రచయిత చక్కటి ప్రబోధాన్ని పై చైతన్య గీతికా ద్వారా మనకు అందించారు. అవమానాలే - ఆభరణాలు అనుమానాలే - అనుకూలాలు సందేహాలే - సందేశాలు చీట్కరాలే - సత్కారాలు అనుకోవాలీ అడుగేయాలీ మూళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపోస్తున్నా కలలేకన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికీ వారే లోకంలో ఎవరికీ పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి వసీరా గారు అన్నట్లు “కాళ్ళు తడవకుండా సంద్రం దాటగలిగిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు” అన్నది ముమ్మాటికీ నిజం.ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్లు కష్టాలు సర్వసామాన్యమైనవి.వాటిని మనం ఎలా అధిగమించమన్నదే ముఖ్యం. జీవిత సారాన్ని ఒక పాటలో నింపేశారు.ఎందరో జీవితంపై ప్రభావం చూపిన పాట ఇది. ఈ పాట సిరివెన్నెల రాసిన ‘నీ ప్రశ్నలు నీవే ఎవరో బదులు ఇవ్వరుగా “ అనే పాటను కొంతవరకు పోలి ఉంటుంది. విజయానికి మార్గం నిర్మించుకుంటున్నప్పుడు లేదా శ్రమిస్తున్నప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళ కంటే అవమానపరిచి, ఆత్మస్థైర్యాన్ని సడలించి,వెనుకకు లాగే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు.మనోసంకల్పం బలమైనప్పుడు మనలోని ఆత్మవిశ్వాసం గురువుగా మార్చుకొని జీవితాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అవమానాలను ఆభరణాలుగా ధరిస్తే అంతకు మించిన సానుకూల దృక్పథం ఏముంటుంది. నువ్వు తిట్టినా, విమర్శించిన వాటిని దీవెనలుగా తీసుకోవడం,రాళ్ళు రువ్వినా వాటిని పూల వర్షంలా భావిస్తే ఎవరేం చేయగలరు అంటూ జీవితములో ఓర్పు, సహనం, సానుకూలత ప్రాధాన్యతను తెలియజేస్తూ, అవే మన విజయానికి పునాదులుగా కవి వర్ణించిన తీరు అందరికి ఆదర్శనీయం. పంచాక్షరి,అష్టాక్షరిని పఠించిన్నట్టుగానే ‘శ్రమ’ అనే ద్వయ అక్షరిని నిత్యం పటిస్తూ, నమ్మకంతో ముందుకు సాగుతుంటే ముళ్ళ మార్గాలు కాస్త పూల మార్గాలుగా మారవా అంటూ రచయిత అందించిన ప్రేరణ ఎందరికో స్ఫూర్తిదాయకం. నిత్య జీవన పోరాటంలో ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు సాగుతుంటారు,ఎవరు స్వార్థం వారిది ఈ లోకంలో నీకు సాయం చేయడానికి ఎవరూ రారు. నువ్వు విజయం సాధించే వరకు ఎవరు నీ వెంట నడవరు .కావున నీతో నువ్వు,నీకు నువ్వే కొండంత ధైర్యంతో ముందుకు సాగాలి అంటూ రచయిత చక్కటి సందేశం ఇచ్చారు. అలాగే మనం ఏం పని చేసినా సరే అందరూ కూడా మొదటగా ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, తరువాత నువ్వు ఆ పనిలో మెరుగవుతుంటే ఉదాసీనత ప్రకటిస్తారు, నువ్వు విజయం సాధించిననాడు ప్రశంసిస్తారు. ఇది లోకం తీరు.కావున ఏ విమర్శ దగ్గర ఎవరికోసం నువ్వు ఆగిపోకూడదు అంటూ జీవన పోరాటం తాలూక అంతరార్ధాన్ని ప్రస్ఫుటం చేశారు. బలము నువ్వే బలగం నువ్వే ఆటా నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరు నీకే నింగిలోనా తెల్లమేఘం నల్లబడితేనే జల్లులు కురిసేది చెట్టుపైనా పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసెను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు శోకం వచ్చినప్పుడు విరాగిగా మారకుండా ఆత్మవిశ్వాసముతో ముందుకు సాగాలి.ఈ గేయంలో మన గుండె ధైర్యమే మన బలం, మనకు మనమే మహా సైన్యం, బ్రతుకు అనే క్రీడమైదానములో ఆట మనమే ఆడాలి , దాని గెలుపు మనదే ఉండాలి. నారు పోసిన వాడు నీరు పోయడా ! అంటూ చేతులు కట్టేసి కూర్చోవడం కాదు, నారు నువ్వే దానికి ప్రాణం పోసే నీరు నువ్వే, కష్టం నీదే,దాని ఫలం నీదే అంటూ రచయిత శ్రమైక జీవన సౌందర్యాన్ని ఈ పాటలో తెలియజేశారు.కష్టాలు నన్ను కమ్మేసాయి,బాధలు నన్ను చుట్టుముట్టాయి,కాలం కలిసి రావడం లేదని ఇలా దుఃఖించవద్దు. నేటి కష్టమే రేపటి ఆనందం.ఆకాశంలో తెల్లగా, తేలికగా నడయాడే మేఘాలు బరువెక్కినప్పుడు,నల్లబడినప్పుడే ( కష్టాలు, బాధలు, కన్నీళ్లు ) కదా చల్లని చిరుజల్లులు (సుఖశాంతులు) కురుస్తాయని,ఫలాన్ని అందించే ముందు చెట్టు పూలు పూస్తుంది.ఆ పూలు రాలితే కదా? పిందెలు కాస్తాయి, కమ్మని ఫలాలు అందిస్తాయి.అలానే జీవితంలో పోరాటాలు, శ్రమ, కష్టాలు ఎదుర్కొన్నప్పుడే విజయ ఫలాలు జీవితానికి అందుతాయనే సత్యాన్ని ప్రకృతి ధర్మానికి అన్వయిస్తూ చక్కటి ప్రబోధం చేశారు. అలాగే అందమైన సూర్యోదయానికి ముందు గడిచిన అంధకారం మాదిరిగా జీవితంలోని సాధించే విజయాలకు ముందు భరించిన అవమానాలు,ఎదురయ్య అవరోధాలు చాలా సహజమైనవి.ప్రతి ఉదయానికి ముందు చీకటి ఉన్నట్టే ప్రతి వ్యక్తి జీవితంలో తన విజయం సాధించుటకు ఎన్నో కష్టాలు,అవమానాలు, బాధలు, కన్నీళ్లు తప్పక భరించాల్సిందేనని, ఒక రోజులో చీకటి వెలుతురు ఎలా ఉంటాయో అలాగే జీవితములో కష్టం సుఖాలు రెండు ఉంటాయనే జీవన సత్యాన్ని బోసు గారి ఈ పాటలో తెలియజేసారు. “నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి ఆలోచించగలిగే వ్యక్తికి విజయ సోపానాలు అందినట్టే” అని స్వామి వివేకానంద గారు అన్నట్టుగా నీ జీవితానికి గతం తాలుక చీకటి కోణాలను, చేదు జ్ఞాపకాలను వదిలి భవిష్యత్ పై ఆశతో ముందుకు సాగలనే సందేశం ఈ పాటలో ఉంది.మరో ప్రపంచం పిలిచిందని భావించి కొత్తగా మళ్లీ మొదలు పెట్టడమే అసలైన విజయం. ఒక మనిషి అన్ని తానై,జీవితంలో వచ్చే అన్ని సమస్యలను ఎదుర్కొంటూ, తనపై తనకు ఆత్మవిశ్వాసంతో,ఆత్మబలంతో ఒంటరిగానైనా ముందుకు సాగి విజయ తీరాలను అందుకోవాలని తెలియజేసిన ప్రేరణాత్మక గేయం ఇది. ముగింపు: “ఏమైనా సరే కవిత్వం మేల్కొల్పాలి గాని జో కొట్టకూడదు” 2 అని శ్రీశ్రీ గారు అన్నట్లు నిరుత్సాహపరులు ,పరాజితులు,హతాశుల జీవితాల్లో వెలుగులు నింపుటకు తన అక్షరాలతో చైతన్య జ్యోతి రగిలించి,కవిత్వం తాలూకా పరమ ప్రయోజనమైన ఉపదేశాన్ని చంద్రబోస్ గారు ఈ పాట ద్వారా మనకందించారు..నిరాశ నిస్పృహలు మిమ్మల్ని కమ్మేస్తున్నప్పుడు ఈ పాటలో భావాన్ని జ్ఞప్తిక చేసుకుంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. నీకోసం ఎవరూ రారు, నీ జీవితానికి కర్త కర్మ క్రియ అన్ని నువ్వే అనే అపురూపమైన సందేశమే ఈ పాట యొక్క భావం. స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని మనసులో నింపిన పాట.కష్టాల ఊబిలో కూరుకుపోయి కుంగిపోతున్న వారికి,మానసిక సంఘర్షణలు కలిగిన వారికి, దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి, గాయపడిన మనసులకి చక్కటి ఔషధం ఈ గేయం.సుఖదుఃఖాలు గెలుపోటములు సంగమమే జీవితం,అది లేకుండా జీవితం లేదు.అయితే కష్టాలను ఎలా తట్టుకొని నిలబడాలి, ఎలా ముందుకు సాగాలి, సుఖసంతోషాలు, విజయ తీరాల వైపు ముందుకు ఎలా నడవాలి అన్న జీవిత రహస్యం ఈ పాట ద్వారా చంద్రబోస్ గారు మనకందించారు.సందర్భానికి తగ్గట్టుగా అర్థం, భావం, ప్రేరణ చెదిరిపోకుండా చక్కటి పదాల పొందికతో, ఎంతో కవితాత్మకంగా,లయాత్మకంగా రాశారు. ప్రాసలతో పాటను ప్రేక్షకుల శ్రోతల,హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.జీవన గమనానికి, జీవిత గమ్యానికి దారి చూపే పాటలు చంద్రబోస్ అక్షర దీపాలు. 4. పాద సూచికలు 1. న్యూఢిల్లీలో సినిమా ప్రేక్షకుల శాంపిల్ సర్వే, యోజన - స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచిక,ఆగష్టు 1995,పుట. 35. 2. శ్రీ శ్రీ సూక్తులు - సాహిత్యం , పుట. 69. 5. ఉపయుక్త గ్రంథ సూచి 1. ఆనందచారి కె + శరత్ చంద్ర తిరునగరి (సం.) 2022.సినీగీతావరణం. హైదరాబాద్ :ప్రగతి ప్రింటర్స్. 2.చంద్రబోస్ కనుకుంట్ల, సినీగీతాల పుస్తకం నుండి సేకరణ (అముద్రితం) 3.చక్రవర్తి జయంతి, 2017.వేటూరి పాట. విజయవాడ :రోహిత్ ప్రింటర్స్. 4.చంద్రశేఖర్ బూర్ల, 2018.తెలుగు సినిమా పాట ప్రభోదాత్మకత. హైదరాబాద్ :కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్. 5.చంద్రబోస్. సినిమా పాటలు సేకరణ https://www.lyricstape.com 6.పైడిపాల, 1992.తెలుగుసినిమా పాట. చెన్నై :స్నేహ ప్రచురణలు. 7.రామలక్ష్మీ కె, 2017.భువనచంద్ర సినీగేయ సాహిత్యం పరిశీలన (అ.సి. గ్రం). చెన్నై :మద్రాసు విశ్వవిద్యాలయం. 8.రాధాకృష్ణారెడ్డి దేవిరెడ్డి, 2010.తెలుగు సినిమా పాటలు -సామాజిక స్పృహ (అ. సి. గ్రం ).తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. 9.రామకృష్ణ కె, 1995.శ్రీశ్రీ సినీగీతాలు ఒక పరిశీలన (అ.సి.గ్రం).అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. 10.రుక్మిణి మాదాల, 2010.తెలుగు సినీగీతాలు ఒక పరిశీలన (అ.సి.గ్రం). తిరుపతి : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.

Powered by OpenAIRE graph
Found an issue? Give us feedback